pitapuram pada gaya
🌺 గయ 🌺
ఈ భూమండలంపై పితృముక్తికరమైన క్షేత్రాలు ఐదు మాత్రమే కలవు అవి 1) శిరోగయ ( బీహారు ) 2) నాభి గయా ( ఒడిషా ) 3) పాదగయ ( పిఠాపురం ) 4) మాతృగయ ( గుజరాత్ ) 5) బదరీ బ్రహ్మకపాలా క్షేత్రం.
త్రిగయా క్షేత్రాలములలో పిఠాపురం లో యున్న పాదగయ క్షేత్రం ఒకటి కాశి వరకు వెళ్లలేని వాళ్ళు పిఠాపురం వచ్చి పితృకర్మలు జరిపిస్తారు. అందుకనే దక్షిణ కాశి అని పిఠాపురాన్ని పిలుస్తారు.
🌺 గయ 🌺
గయ, హిందువుల పవిత్రమైన స్థలం. ఇది బీహార్ రాష్టంలో గయ జిల్లాలో ముఖ్యపట్టణం. రాష్ట్ర రాజధాని పాట్నా నుండి 100 కి.మీ. దూరంలో ఉంది. గయ చారిత్రాత్మక మగధ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది.
1. గయాసురుడు రాక్షసుడే అయినా మహా భక్తుడు. ఆయన రాక్షసులకు రాజు. వేలాది సంతవ్సరాలు మహావిష్ణువును ప్రసన్నం చేసుకునేందుకు చాలా గొప్ప తపస్సు చేశారు. తను చేసిన అద్భుతమైన తపస్సుకు ప్రసన్నుడై మహావిష్ణువు వరం కోరుకొమ్మనగా నా శరీరం అన్ని పరమ పావనమైన తీర్థాలకన్నా పవిత్రమై ఉండేలాగా వరం కావాలని కోరుకున్నారు. విష్ణువు ఆ కోరికను మన్నించగా గయాసురుని శరీరం పరమ పవిత్రమైపోయింది. బ్రహ్మహత్య, సురాపాన, స్వర్ణస్తేయ, గురుతల్ప మొదలైన పంచమహాపాపాలు సహితంగా అన్ని రకాల పాపాలు ఆయన శరీరాన్ని తాకగానే నశించిపోయేవి.
2.ఆయనను తాకివెళ్ళిన ప్రతివారూ నేరుగా మోక్షాన్ని పొందేవారు, అంతేకాక కీటకాలు, సూక్ష్మజీవులు కూడా గాలికి కొట్టుకువస్తూ ఆయన శరీరాన్ని తాకిపోతూండగానే మోక్షాన్ని పొందేవి. ఇది కాక ఆయన చేసిన గొప్ప యాగాలు, పుణ్యకార్యాల వల్ల నేరుగా ఇంద్రపదవి లభించింది, అప్పటివరకూ స్వర్గాధిపతిగా ఉన్న ఇంద్రుడు పదవీభ్రష్టుడయ్యారు. పదవిని కోల్పోయిన ఇంద్రుడు కూడా ఘోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రసన్నం చేసుకున్నారు. బ్రహ్మ ఓ గొప్ప యాగాన్ని తలపెట్టానని, దానికి తగ్గ పరమ పవిత్రమైన స్థలాన్ని చూపించమని గయాసురుణ్ణి కోరారు. గయాసురుడు చాలా భారీకాయుడు. 576 మైళ్ళ పొడవు, 268 మైళ్ళ నడుము చుట్టుకొలత కలిగిన అతికాయుడు కాబట్టి పవిత్రమూ, విశాలమూ అయిన తన తలపై యజ్ఞం చేసుకొమ్మని అనుమతించారు.
3. బ్రహ్మ యాగం వేడికి గయుని తల కదలడం ప్రారంభించింది. దాన్ని కదలకుండా చేసేందుకు బ్రహ్మ చాలా పెద్దపెద్ద శిలలను గయాసురిని తలపై పెట్టసాగారు. ఆ శిలలేవీ కూడా గయాసురుని తల కదలకుండా ఆపలేకపోగా అవన్నీ చుట్టూ పడి రామపర్వతం, ప్రేతపర్వతం వంటివి ఏర్పడ్డాయి. దానితో బ్రహ్మ చివరకు మరీచి శాపం వల్ల శిలగా మారిన మహాపతివ్రత దేవవ్రత శిలను తీసుకువచ్చి తలపై పెట్టారు. శిలారూపంలోనున్న మహాపతివ్రతను తోసివేయలేక కదలికలు కట్టడి చేసుకున్నా మొత్తానికి మానుకోలేకపోయాడు. అప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని ప్రార్థించగా ఆయన గదాధారుడై వచ్చి తన కుడికాలు గయాసురుని తలపై పెట్టి తొక్కిపట్టారు.
4. గయాసురుడు ఆ సమయంలో విష్ణుమూర్తిని ప్రార్థించి నా శరీరం పరమ పవిత్రమైన తీర్థక్షేత్రంగా వరం పొందింది. నా తలపై బ్రహ్మదేవుడే యాగం చేశాడు. పతివ్రతయైన దేవవ్రత శిలారూపంలో నిలిచింది. సాక్షాత్తూ మహావిష్ణువువైన నీవే కుడిపాదాన్ని పెట్టావు. ఇన్ని పొందిన నా శిరోమధ్యపాద భాగాలు పితృదేవతలను సైతం తరింపజేసే ప్రభావశాలి, పరమ పవిత్రమూ అయిన దివ్యక్షేత్రములయ్యేట్టుగా, అవి తన పేరున వ్యవహరింపబడేట్టుగా వరం కావాలని కోరి పొందారు. దాని వల్లనే ఆయన శరీరంలో తల భాగంలో ఉన్న ఈ పట్టణం పరమ పవిత్రంగా పితరులను తరింపజేసే ప్రాంతంగా పేరొందింది.
5. గయ హిందువులకు పితరులకు మోక్షప్రదాయకమైన నగరంగా విశ్వదించబడుతుంది. ఇక్కడ పితరులకు పిండప్రదానం చేస్తే పితరులకు మోక్షం లభిస్తుందని హిందువుల విశ్వాసం. శ్రీరాముడు తనదేవేరి సీత, సోదరుడైన లక్ష్మణునితో ఇక్కడకు వచ్చి పితరులకు పిండప్రదానం చేసినట్లు పురాణకథనాలు వర్ణిస్తున్నాయి. పిండప్రదానానికి ముందు స్నానమాచరించడానికి శ్రీ రాముడు వెళ్ళిన సమయంలో మహారాజైన దశరథుని హస్తాలు రెండు సీతముందు కనిపించి తాను చాలా ఆకలిగా ఉన్నానని రామునికి బదులుగా పిండం ప్రదానం చెయ్యమని సీతను అడుగగా సీతాదేవి పిండములు తీసి ఆచేతులలో ఉంచింది. శ్రీరాముడు తిరిగి వచ్చి యధావిధిగా పిండములు ప్రదానము చేసే సమయములో అతని తండ్రి ఆ పిండాలను స్వీకరించక పోయినప్పుడు శ్రీరాముడు ఆశ్చర్యానికి గురికావడమే కాక బాధపడ్డాడు. తరువాత సీతాదేవి జరిగిన ఉదంతం వివరించి సాక్ష్యానికి ఫలగు నది సమీపంలో నిలిచియున్న బ్రాహ్మణుని, ఆవుని, రావిచెట్టుని పిలిచింది. రావిచెట్టు తప్ప మిగిలిన వారు సాక్ష్యం చెప్పలేదు. ఆవు శ్రీ రామునికి భయపడి, ఫల్గూ నది శ్రీరాముని నుండి అధిక వరాలు పొందడానికి, బ్రాహ్మణుడు శ్రీరాముని నుండి అధిక దక్షిణ పొందాలని నిజం చెప్పలేదు. సీతాదేవి ఆముగ్గిరిని శపించిందని పురాణకథనం వివరిస్తుంది. శాపకారణంగా ఫల్గూనదిలో నీరు ఇంకి పోయింది. రావిచెట్టును శాశ్వతంగా జీవించమని వరమిచ్చింది. ఈ రావిచెట్టు ఆకులు ఎప్పుడూ రాలవని ఎప్పుడూ పచ్చగానే ఉంటాయని ఇక్కడివారు చెప్తున్నారు. అక్షయ వృక్షం అంటే ఎప్పటికీ క్షయం పొదని వృక్షం అని అర్ధం. కరువు సమయంలో కూడా ఈ వృక్షం పచ్చగా ఉంటుంది.
--------------------------------------------------శుభం --------------------------------------------------------

Comments
Post a Comment
thanks for your comment